గాజువాక: వివిధ పరిశ్రమలు, స్టాకు యార్డుల నుంచి ఖరీదైన ఇనుప సామగ్రి, మోటారు సైకిళ్లు తస్కరించిన 19 మంది నిందితులను గాజువాక, స్టీల్‌ప్లాంట్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వీరినుంచి సుమారు లక్ష రూపాయల వస్తువులు, తొమ్మిది మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. గాజువాక ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీసీపీ బ్రహ్మారెడ్డి, సౌత్ ఏసీపీ అచ్చుతరావు, క్రైం సీఐ బాపూజీలు వివరాలు వెల్లడించారు.గాజువాక ప్రాంతానికి చెందిన వి.సంతోష్, హరి, ఆర్.వెంకటరావు, జి.రవి, కె.పోలయ్య, పి.నర్సింగరావు, కె.సత్తిబాబు, వెంకటసంతోష్, బచ్చా శంకర్‌లు ఇనుప తుక్కుదొంగతనాలు చేస్తుంటారు. వీరు మూడు నెలలుగా బ్యాచ్‌లుగా వివిధ పరిశ్రమలు, స్టాక్‌యార్డుల్లో స్టయిన్‌లెస్ స్టీల్ మెటీరియల్, ఐరన్ ప్లేట్స్, నాలుగు మోటారు సైకిళ్లు దొంగిలించి తప్పించుకుతిరుగుతున్నారు. సన్యాసిరావు అనే తుక్కు వ్యాపారికి విక్రయిస్తున్నట్లు తెలుసుకొని పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు.స్టీల్‌ప్లాంట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అయిదు మోటారు సైకిళ్లు, రూ.15 వేలు ఖరీదు చేసే పిగ్ ఐరన్, ఐరన్ బిల్లెట్లు తస్కరించిన ఎం.గణేష్, ఎం.అప్పలరాజు, డి.లోవరాజు, వై.పైడిరాజు, రాజుబహుదూర్, డి.వేణు, శరత్‌సాహూ, టి.పైడిరెడ్డి, జి.అప్పలరెడ్డి, డి.శ్రీనులను పోలీసులు అరెస్టు చేశారు. చొరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. స్క్రాప్ వ్యాపారి లక్ష్మికి చోరీసొత్తు అమ్ముతుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. అపరిచిత వ్యక్తులు కాలనీల్లో తిరిగినా, చోరీసొత్తు విక్రయాలు ఎక్కడైనా జరిగినా తక్షణం పోలీసుల దృష్టికి తీసుకురావాలని డీసీపీ ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. నిందితులను పట్టుకున్న క్రైం సిబ్బందిని అభినందించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి