విశాఖపట్నం(విశాల విశాఖ): మధ్యాహ్న భోజన పథకానికి జిల్లావ్యాప్తంగా రూ.2కోట్ల నిధులు మంజూరైనట్లు డీఈవో ఎం.సూర్యనారాయణ తెలిపారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆదివారం ఎం.ఇ.ఓ.లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషనలైజేషన్‌కు సంబంధించి ఏయే మండలాల్లో ఉపాధ్యాయులు అవసరమో వివరాలు సేకరించారు. విద్యార్థులు తక్కువగా.. ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో సిబ్బందిని సమీప పాఠశాలలకు తరలించేందుకు చర్యలు చేపడతామన్నారు. జనవరి 31 వరకు పాఠశాలల్లో ఖాళీల జాబితా తయారుచేయాలని ఆదేశించారు. 183 పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అమల్లో ఉందని, వాటి నిర్వహణకు సంబంధించి ప్రధానోపాధ్యాయులు, మండల స్థాయిలో ఎంఈవోలు నివేదిక తయారుచేసి అందజేయాలన్నారు. పదోతరగతి ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి పాఠశాలల్లో ప్రత్యేక శిక్షణ సక్రమంగా జరుగుతుందా లేదా అనే విషయమై ఆరాతీశారు. రాజీవ్ విద్యామిషన్ పీవో సాయిబాబు మాట్లాడుతూ విద్యార్థులకు నెలరోజుల్లో యూనిఫాంలు అందజేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. 1-8 తరగతుల విద్యార్థుల వివరాలను పాఠశాలల వారీగా అందజేయాలన్నారు. సమావేశంలో ఉప విద్యాశాఖాధికారులు సి.వి.రేణుక, లింగేశ్వరరెడ్డి, డి.ఐ రమణ పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి