1.రూ.11 కోట్లు సాయం అందించే చర్యలు
2. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన 2 లక్షల మంది అన్నదాతలకు ప్రయోజనం
విశాఖపట్నం(విశాల విశాఖ) : తుపాను ప్రభావంతో ఈ ఏడాది కురిసిన అకాల వర్షాలు పంటలను ముంచెత్తి ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీసింది. రబీతో ఒడ్డెక్కేందుకు ప్రయత్నిస్తున్న రైతులకు బాసటగా ఉండాల్సిన ప్రభుత్వం అరకొర సాయంతో సరిపెడుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ డెయిరీ రైతులను ఆదుకొనేందకు మందుకొచ్చింది.రాష్ట్రంలో ప్రధాన పాడి పరిశ్రమలో ఒకటైన విశాఖ డెయిరీ మూడు జిల్లాల పాడి రైతులను ఆదుకోవడానికి ముందుకొచ్చింది. అల్పపీడనాల ప్రభావంతో అకాల గాలి, వర్షాలకు రైతులు పంటలతోపాటు పాడిని కూడా తీవ్రంగా నష్టపోయిన విషయం గుర్తించింది. ఓ పక్క సర్కారు సాయం అందించేందుకు మీన మేషాలు లెక్కిస్తూ కేవలం వరి పంటకే ఇన్‌పుట్ సబ్సిడీ పేరుమీద ఎకరాకు రూ.2400 ఇస్తానని ప్రకటించింది. మిగతా పంటల పరిహారంపై నిర్థిష్టమైన హామీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అప్పుల కష్టాల్లో కూరుకుపోయిన అన్నదాతను ఆదుకునేందుకు డెయిరీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. గ్రామీణ పాల సంఘాల ఉమ్మడి భాగస్వామ్యతో రూ.11 కోట్లు సాయం అందించే చర్యలు మొదలు పెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నవంబరు 30 వరకు డెయిరీకి సరఫరా చేసిన పాల ఉత్పత్తిని లెక్కకట్టింది. ఇందులో గేదె పాల లీటరుకు రూ.1.75 పైసలు, ఆవు పాలకు రూ.1.20 పైసలు చొప్పున లెక్కించి సాయం అందించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే రూ.7 కోట్ల వరకు ఆర్థిక సాయాన్ని నేరుగా రైతులకు అందించింది. సంక్రాంతి పండగ నాటికి అంచెలంచెలుగా మరో రూ.4 కోట్లు చెల్లింపులు పూర్తిచేసేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన 2 లక్షల మంది అన్నదాతలకు ప్రయోజనం చేకూరింది. ఈ సందర్భంగా డెయిరీ ఛైర్మన్ తులసీరావు తమ పాలకవర్గ సభ్యులతో గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి వ్యవసాయ రంగం ఆటుపోట్లుకు గురైనా ఆత్మస్త్థెర్యం కోల్పోవద్దని రైతులకు భరోసా ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇస్తున్నారు. జరిగిన నష్టాన్ని పాడి పరిశ్రమ ద్వారా పూడ్చుకునేందుకు డెయిరీ అండగా ఉంటుందని చెబుతున్నారు. కొత్త పశువులను సమకూర్చుకునేందుకు వడ్డీలేని రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు వివరిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి