విశాఖపట్నం: సింహాచలం దేవస్థానం భూములకు సంబంధించి పంచ గ్రామాల్లో నిర్వహిస్తున్న సమగ్ర సర్వే పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ప్రసంగించారు. సర్వే నెంబర్ల వారీగా వివరాలను సేకరించాలన్నారు. అడవివరం, పురుషోత్తమపురం, వెంకటాపురం, చీమలాపల్లి, వేపగుంట గ్రామాల్లో సర్వే కోసం అయిదు బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రతీ బృందంలో డిప్యూటీ తహసిల్దార్, సర్వేయరు, దేవస్థానం ఉద్యోగి సభ్యులుగా ఉంటారన్నారు. తహసిల్దార్ ఆధ్వర్యంలో సమగ్ర సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భూమి చరిత్ర, యజమాని పేరు, ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉన్నదీ, సంబంధించిన డాక్యుమెంట్లు, సంక్రమించిన విధానాలను నమోదు చేయాలన్నారు. నెలాఖరు నాటికి సర్వే పూర్తి చేయాలని కోరారు. ఈ ప్రాంతాల్లో ఎటువంటి ఆక్రమణలు జరగకుండా, తగిన జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దేవస్థానం పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, చేపట్టవల్సిన పథకాలపై చర్చించారు. సంయుక్త కలెక్టర్ పోలా భాస్కర్, డీఆర్వో డి.వెంకటరెడ్డి, ఆర్డీఓ కె.ప్రభాకరరావు, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ప్రేమ్‌కుమార్, ప్రత్యేక ఉప కలెక్టర్ సత్యనారాయణ, పెందుర్తి తహసిల్దార్ ఎన్.ఎస్.ఎన్.స్వామి, దేవస్థానం, సర్వే శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి