రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య వాగ్ధానాలను మానుకుని, వరద బాధితులను ఆదుకోవాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సూచించారు. ప్రకృతి రైతులపై కక్షగట్టి వెంటాడుతుంటే వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.వరద తాకిడితో మృతి చెందిన కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చిరంజీవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖరీఫ్‌లో తడిచిన ధాన్యానికి పూర్తి మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని, వర్ష బాధితులకు 50కేజీల బియ్యం, 10 లీటర్ల కిరోసిన్ అందివ్వాలని చిరంజీవి డిమాండ్ చేశారు.వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటిస్తున్న చిరంజీవి సోమవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని పశ్చిమ గోదావరి జిల్లా చించినాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పీఆర్పీ అధినేత మాట్లాడుతూ.. ఉభయగోదావరి జిల్లాల్లో కుండపోత వర్షాలతో తీవ్రంగా నష్టపోయింది కౌలు రైతులేనని, పీఆర్పీ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.కౌలు రైతులకు ప్రభుత్వ సాయం అందడం లేదని, ఈ అంశాన్ని వారం క్రితమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వారిని ఆదుకుంటామని ప్రభుత్వం కూడా హామీ ఇచ్చిందని, అది నెరవేరేలా ప్రజారాజ్యం పార్టీ కృషి చేస్తుందన్నారు.పనిలో పనిగా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులపై చిరంజీవి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని చిరు ధ్వజమెత్తారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులను చిరంజీవి దద్దమ్మలు, స్వార్థపరులుగా అభివర్ణించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి