హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు ముగింపు సభకు సినీ నటి, తెలుగు మహిళ మాజీ అధ్యక్షురాలు రోజాకు, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతికి ఆహ్వానాలు అందాయి. ఈ నెల 3వ తేదీన నెల్లూరు జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభమైంది. ఆదివారం జిల్లాలో ముగింపు సభ జరుగుతుంది. ఈ ముగింపు సభలో రోజా పాల్గొనే అవకాశాలున్నాయి. లక్ష్మీపార్వతి మాత్రం డైలమాలో ఉన్నారు. వర్షం కారణంగా తాను వెళ్లలేకపోతున్నట్లు లక్ష్మీపార్వతి చెప్పారు. రైలు సౌకర్యం లేదని, కారులో వెళ్తే తుఫాను వల్ల అడ్డంకి ఏర్పడవచ్చునని, అందుకే తాను వెళ్లలేకపోతున్నానని లక్ష్మీపార్వతి ఓ తెలుగు ప్రైవేట్ టీవీ చానెల్ తో చెప్పారు. తనను జగన్ పిలువలేదని, జగన్ ఎవరిని కూడా తన ఓదార్పులో పాల్గొనాలని పిలువడం లేదని ఆమె చెప్పారు.జగన్ ఓదార్పు యాత్రలో ఒక్క రోజైనా పాల్గొనకపోతే ద్రోహమే అవుతుందని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రకు కూడా తాను ఓ రోజు వెళ్లి మద్దతు చెప్పానని ఆమె గుర్తు చేశారు. వైయస్ జగన్ తండ్రి కోసం యాత్ర చేపట్టారని, చాలా కష్టపడుతున్నాడని ఆమె అన్నారు. నెల రోజుల క్రితం వైయస్ జగన్ మద్దతుదారులు తనను అహ్వానించారని, తాను సానుకూలంగా ప్రతిస్పందించానని ఆమె చెప్పారు. మళ్లీ ఈ రోజు తనను ఆహ్వానించారని, అయితే ఎలా వెళ్లాలనేది నిర్ణయించుకోలేకుండా ఉన్నానని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మంచి పనులు చాలా చేశారని ఆమె ప్రశంసించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి