విశాఖపట్నం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. అనేకచోట్ల రోడ్లుపైకి నీరు చేరుకోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కంచరపాలెం ఊర్వశి థియేటర్ దగ్గరి అన్నపూర్ణ షాపింగ్ కాంప్లెక్స్‌లోకి నీరు చేరుకోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అగ్నిమాపకశాఖ స్పందించి మోటార్ల సాయంతో నీరు బయటకు తోడించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 41వ వార్డులోని శ్యామానంద్‌కాలనీ, తుమ్మడపాలెంలోకి సమీపంలోని గెడ్డ నీరు చేరుకోవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. గవర కంచరపాలెంలో మూడుకార్లపై రక్షణ గోడ కూలిపోవడంతో నష్టం ఏర్పడింది. జ్ఞానాపురంలోభారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) గొదాంలోకి నీరు చేరడంతో స్వల్పంగా నష్టం ఏర్పడింది. చావులమదుంలో చేరిన వరదనీటితో వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. వెంకోజీపాలెంలోని రెండుచోట్ల కొండ చరియలు విరిగిపడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. మహా నగరంలో గడిచిన 24 గంటల్లో 112.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.నగరంలోని శివారు ప్రాంత ప్రజలు భారీ వర్షాలతో కన్నీరు పెట్టుకున్నారు. షీలానగర్‌లోని వెంకటేశ్వరకాలనీలోకి పక్కనే ఉన్న చెరువు నీరు చేరుకోవడంతో జలమయమైంది. వీధుల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో 24 గంటలుగా ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అనేకమంది తాగేందుకు నీరు కూడా లేక అవస్థలు పడ్డారు. పెదగంట్యాడలోని హౌసింగ్ బోర్డు కాలనీ, బర్మా కాలనీ, డెయిరీ కాలనీ, స్వతంత్ర నగర్, రెల్లి కాలనీ, ఎస్సీ కాలనీల్లోకి వరద నీరు చేరుకోవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. గాజువాకలోని దయాల్‌నగర్, కృష్ణానగర్, సుందరయ్యకాలనీలో కొండచరియలు విరిగిపడటంతో స్వల్పంగా నలుగురు గాయపడ్డారు. పాక్షికంగా దాదాపు 20 ఇళ్లు దెబ్బతిన్నాయి. పెందుర్తిలో భారీ వర్షాలతో వరి పంట నెల కొరిగింది. పెందుర్తి-అరకు రోడ్డులో అనేకచోట్ల చేతికొచ్చిన పంట నీటి ముంపునకు గురవ్వడంతో రైతులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. విమానాశ్రయంకు మరోసారి వరద నీటి ముంపు ఏర్పడటంతో కలకలం చెలరేగింది. మేఘాద్రిగెడ్డ నుంచి పెద్దఎత్తున నీరు రావడంతో ప్రవేశ మార్గాన్ని తాత్కాలికంగా నిలిపివేసి ప్రత్యామ్నాయంగా మరో మార్గాన్ని తెరిచారు. విమానయాన సేవలకు అంతరాయం ఏర్పడలేదు. భీమునిపట్నం మండలంలో 4 చెరువులకు గండ్లు పడ్డాయి. దాదాపు 500 హెక్టార్లలోవరి పంటకు నష్టం ఏర్పడినట్లు అంచనా. వివిధ గ్రామాల్లో 20 పూరిళ్లు కూలిపోయాయి. తాటితూరులో పాఠశాల భవనంలోకి నీరు చేరుకోవడంతో తరగతుల నిర్వహణ సాధ్యం కాలేదు. తగరపువలస-పద్మనాభం రోడ్డుపైకి నీరు చేరుకోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.మేఘాద్రిగెడ్డ వరద నీటి పరవళ్లతో పెందుర్తి మండలంలోని ఏకలవ్యకాలనీ జలదిగ్భందనమైంది. వరద నీరు ఒక్కసారిగా కాలనీని చుట్టు ముట్టడంతో ప్రజలు లబోదిబోమన్నారు. 36 కుటుంబాలున్న ఈ కాలనీ నుంచి అనేకమంది ప్రాణాలు కాపాడు కునేందుకు పరుగులు తీయగాఏడుగురు వరద నీటిలో చిక్కుకున్నారు. ఇళ్లలోకి నీరు చేరుకోవడంతో వీరు గత 12 గంటలుగా బిక్కుబిక్కుమంటూ గడిపారు. సోమవారం మధ్యాహ్నాం ఒంటి గంట సమయంలో పద్మనాభం నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది గాలి నింపిన టైరు ట్యూల్‌ల సాయంతో కాలనీలోకి వెళ్లి నీటిలో చిక్కుకున్న ఏడుగుర్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.బాధితుల కోసం సమీపంలోని కల్యాణ మండపంలో జిల్లా యంత్రాంగం పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి