కొత్త సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎంపిక, వెనువెంటనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజీనామా, ఆ పిమ్మట కేబినెట్ విస్తరణలో అసంతృప్తుల సెగ... ఇలా రాష్ట్ర కాంగ్రెస్‌లో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీటన్నిటితో కాంగ్రెస్ అధిష్టానానికి గత వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా పోయింది.మరోవైపు వైఎస్ జగన్ కొత్త పార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఎంతమేర నష్టం వాటిల్లుతున్నదన్న ఆందోళనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఎదురుదెబ్బను ఎలా తట్టుకుని కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ముందుకు తీసుకుపోవాలన్నదానిపై పీసీసీ చీఫ్ డి. శ్రీనివాసరావుతో విస్తృత స్థాయి మంతనాలు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.మరోవైపు మంత్రివర్గ కూర్పులో తలెత్తిన అసంతృప్తి, మంత్రులు బాహాటంగా మీడియాకు ఎక్కడం, కొంతమంది రాజీనామాల వరకూ వెళ్లడంపైనా హైకమాండ్ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే మంత్రివర్గ విస్తరణ సమయంలో సీనియర్ మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బావుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం.ఇకపోతే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పదవిని తెలంగాణాకు చెందిన నాయకులకే కట్టబెడతామని స్వయంగా వీరప్ప మొయిలీ ప్రకటించిన నేపథ్యంలో మర్రి శశిధర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, గీతారెడ్డి సోనియా గాంధీతో సమావేశమవ్వడం ప్రాధాన్యత సంతరించుకున్నది. వీరు ముగ్గురూ ఆ పదవిని ఆశిస్తున్నారా..? అన్నఅనుమానాలువ్యక్తమవుతున్నాయి. కానీ గీతారెడ్డి మినహా మిగిలిన నాయకులు తమకు ఉపముఖ్యమంత్రి పదవి కావాలని అడిగిన దాఖలాలైతే లేవు.మరోవైపు పీసీసీ చీఫ్ పదవి ఎవరికి ఇవ్వాలన్నదానిపైనా కసరత్తు జరుగుతోంది. ముఖ్యమంత్రి పదవిని సీమాంధ్రకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డికి కట్టబెట్టారు కనుక పీసీసీ చీఫ్ పదవిని తెలంగాణాకు చెందిన నాయకుడికి ఇవ్వాలన్న యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. దీనితోపాటు స్పీకర్ పదవిపైనా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి